ఓం నమశ్శివాయ
శివుడికి జననం మరణం అంటూ ఏమీ ఉండవు. కాలాతీతుడు. అంటే కాలమునుకు వశము కానివాడు. అంతయు శివుడే. త్యాగానికి ప్రేమకి నిలువెత్తు ప్రతిరూపం ఈ మహాదేవుడు. ప్రతి ఒక్కరి మదిలో వెలిగే భోళా శంకరుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శంకరుడి ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది.
జడలో గంగాదేవి:

గంగ అంటే నీళ్లు, ఆ గంగమ్మ వేగాన్ని కట్టడి చేసేందుకే, మహాశివుడు తన జటాజూటంలో బంధించి,
వేగాన్ని నియంత్రించి, లోకాలని అంతులేని గంగా ప్రవాహం నుంచి రక్షించాడు.
శంకరుని మూడవ కన్ను:

శివుని అనంత గుణాలలో ఒకటి త్రినేత్రత్వం. ఆయన నుదుటిపైన మధ్య భాగములో మూడవ కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురి అయినప్పుడు, చెడును నివారించాలనకున్నప్పుడు మాత్రమే మూడవ కన్ను తెరుచుకుంటుంది .అందుకే మూడవ కన్ను ధ్యానం, మరియు సర్వవ్యాపకత్వానికి ఒక చిహ్నం.
శివుని తలపైన చంద్రుడు:

పరమ పతివ్రత అనసూయ దేవి యొక్క కుమారుడు చంద్రుడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడు, మంచి గుణాలు కలిగి ఉన్న చంద్రున్ని చూసి, తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు. దక్షుడికి 62 మంది కుమార్తెలు. వారిలో 27 మంది కుమార్తెలను, చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన 27 మంది కుమార్తెలను, సమానముగా చూసుకోవాలని, ఎవరినీ బాధ పెట్టొద్దని చంద్రుని వద్ద దక్షుడు మాట తీసుకుంటాడు. అయితే కొద్ది రోజులకి చంద్రుడు మామకి ఇచ్చిన మాట తప్పుతాడు. చంద్రుడికి పెద్దభార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 మంది భార్యలని సరిగ్గా పట్టించుకోడు. ఇదే విషయాన్ని 26 మంది కుమార్తెలు తండ్రి అయిన దక్షుడికి ఫిర్యాదు చేస్తారు. వెంటనే దక్షుడు ఈ విషయం మీద చంద్రున్ని మందలించినా, అతనిలో మార్పు రాకపోవడంతో, కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రునికి శాపం ఇస్తాడు. దిన దినం నీ వెలుగు తగ్గిపోతూ చివరికి అంతం అవుతావని శపిస్తాడు. చంద్రుడు శాపవిమోచనం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. అయినా దక్షుడు ఒప్పుకోకపోవడంతో, చంద్రుడు ముల్లోకాలకి పరిగెడతాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్లగా, తన కుమారుని శాపానికి తిరుగులేదని బ్రహ్మ చంద్రుడిని పంపించేస్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లగా, ఆ మహాశివుడే నీకు దారి చూపించగలడు అని చెప్తాడు. చంద్రుడు శివుని వద్దకు వెళ్లి తనని ఏదోలా కాపాడమని వేడుకొనగా, భోళా శంకరుడు ఉపాయం ఆలోచించి “లోకాకళ్యాణార్థం నీ వెలుగు తప్పనిసరి కనుక పక్షం రోజులు క్షీణించి, తిరిగి పక్షం రోజులు నీ వెలుగు నువ్వు పెరుగుతావు” అని ఆశీర్వదిస్తాడు. అందుకు చంద్రుడు భక్తితో, నీ పాదాల వద్ద చోటు ఇవ్వు శివ అని అడుగుతాడు. శివుడు, చంద్రుడు ఉండాల్సిన చోటు అది కాదని తన తలపై పెట్టుకుని చంద్రశేఖరుడుగా మారాడు. వారంలో 7 రోజులు ఏడు గ్రహాలు ఉంటాయి.అందులో చంద్ర గ్రహం మొదటిది, అంటే సోమవారం రోజు. చంద్రుని ధరించిన వాడుగనుక శివునికి సోమవారం అంటే ప్రీతిపాత్రం. అభిషేక ప్రియుడైన ఆ మహాశివుడికి, శివలింగానికి కొన్ని నీళ్లు పోసినా చాలు, చంద్రగ్రహ దోషాలు ఏమున్నా తొలగిపోతాయి అని ప్రతీతి.
కంఠంలో గరళం:

దేవతలందరూ కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేయాలని అనుకుని, వాసుకి అనే మహా సర్పాన్ని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వముగా చేసుకుని సాగరాన్ని మధించడం మొదలుపెట్టగా, పాల సముద్రం నుంచి చాలా జీవులు, వస్తువులు బయటకు వస్తాయి. అలానే అమృతం కంటే ముందు సముద్రంలో ఆలా హలం ప్రవహించింది. ఆ గరళం
ధాటికి ముల్లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. సమస్త జీవులు పరమేశ్వరుని ప్రార్థించాయి. ఆది భిక్షువు అభయమిచ్చాడు. గరళాన్ని సేవించడానికి సిద్ధమవుతాడు. వెళ్తూ, పార్వతీదేవితో శరణన్న వారిని రక్షించడమే మన కర్తవ్యం, ఈ విషాన్ని తియ్యని పండుల అరగిస్తానని శివుడు అనగా, ఆ గౌరీ దేవి చిరునవ్వుతో అంగీకరించింది. శివుడు కాలకూట విషాన్ని కడుపులో వరకు చేరకుండా కంఠంలో నిలిపివేసింది జగన్మాత పార్వతి దేవి.అప్పుడు ఆయన కంఠం నల్లగా మారింది. అందుకే శివుడు గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. లోక శ్రేయస్సు కోసం, మహాదేవుడు అందరి కష్టాన్ని భరించాడు.
మెడలో పాము:

కశ్యప ప్రజాపతి అనే రాజు కి 14 మంది భార్యలు. వారిలో వినత, కద్రువ అనే ఇద్దరు ఒకరోజు పాలసముద్రం సమీపంలో తెల్లని గుర్రాన్ని దూరంనుంచి చూస్తారు. కద్రువ తన సోదరి వినతతో ఆ గుర్రము తోక నల్లగా ఉందని చెబుతుంది.అయితే వినత అంగీకరించకుండా, లేదు ఆ తెల్లని గుర్రం తోక తెల్లగానే ఉందని చెప్తుంది. దానికి కద్రువ ఉరుకోకుండా పందెం కాస్తుంది. గుర్రం తోక నల్లగా ఉంటే వినత కద్రువ దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిశగా ఉండాలని, ఒకవేళ గుర్రము తోక తెల్లగా ఉంటే కధ్రువ వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి చూద్దామని వెళ్లిపోతారు. నిజానికి గుర్రం తోక తెల్లగానే ఉంటుంది. కద్రువకి వెయ్యిమంది సర్పాలు సంతానం. పందెంలో ఎలా అయినా నెగ్గాలని కుమారులైన సర్పాలుని పిలిచి గుర్రం తోకకు చుట్టుకోమని చెప్తుంది. దానికి సర్పాలు అంగీకరించవు. దాంతో ఆగ్రహం చెందిన కద్రువ, భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారని శపిస్తుంది. పెద్దవాడైన ఆదిశేషుడు మరియు వాసుకి అనే మహా సర్పాలు మినహా, మిగతా సర్పాలు కద్రువకి ఇచ్చిన శాపనికి బయపడి గుర్రంతోకకి వెళ్లి చుట్టుకుంటాయి. అది చూసిన వినత, గుర్రం తోక నల్లగానే ఉందని నమ్మి, అన్నమాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పని చేస్తుంది. కొన్నాళ్ళకు వినత కుమారుడైన గరుత్మంతుడు, వినతని బానిస బంధాలునుంచి విముక్తినీ కలుగజెస్తాడు. తల్లి మాటని అంగీకరించని ఆదిశేషుడు శ్రీ మహవిష్ణువు కోసం, వాసుకి శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఆదిశేషుని తన శేశాతల్పంముగా చేసుకుంటాడు. దీనితో ఆదిశేషునికి ఎలాంటి చావు భయం లేకుండా పోయింది. వాసుకి కోసం సాంబశివుడు ప్రత్యక్షమవుతాడు. తన మెడలో నాగాభరణంగా వేసుకుని ఎలాంటి మృత్యు భయం లేకుండా చేసాడు. ఆనాటినుండి వాసుకి శివుని మెడలో నాగాభరణంగా దర్శనమిస్తుంది..
బస్మం:

శివుడు స్మశాన వాసుడు. శివాలయాలు స్మశానం పక్కన ఉండటం మనం గమనించవచ్చు. మనిషి చనిపోయాక, అనాథగా మిగులుతాడు. అప్పుడు ఈశ్వరుడు నేనున్నాను అంటూ తనలో భయం దూరం చేసి, ధైర్యాన్ని కలగజేస్తాడు. మనిషి శవాన్ని కాల్చిన బూడిదని శివయ్య తన దేహానికి రాసుకుని తనలో కలుపుకుని ముక్తిని ప్రసాదిస్తాడు. శివయ్య స్పర్శతో భస్మము శుద్ధి చెందుతుంది..
పులి చర్మం:

శివుడు దిగంబరుడు. ఎలాంటి అలంకారాలు లేని మహానుభావుడు. ఒకనాడు శివుడు అడవిలో సంచరిస్తున్న సమయంలో అక్కడ కొంత మంది స్త్రీలు శంకరుని ముఖములో వెలుగు తేజస్సు చూసి ఆకర్షితులవుతారు. శివయ్య అక్కడ్నుంచి వెళ్లినా ఆయన్నే తలుచుకుంటూ ఇంట్లో పనులు సరిగా చెయ్యరు. ఈ విషయం వారి భర్తలకి తెలిసి, శివుణ్ణి చంపాలని, మంత్రశక్తులతో ఒక పెద్దపులిని సృష్టించి, శివుడు వెళ్లేదారిలో వదులుతారు. శివుడు మీదకీ పులి దుకడంతో, శివుడు పులిని చంపివేస్తాడు. తర్వాత శివయ్యకి విషయం తెలిసి ఆ పులిచర్మాన్ని వస్త్రంగా వేసుకుంటాడు.
డమరుకం మరియు త్రిశూలం:

డమరుకం శివుడికి ఇష్టమైన వాయిద్యము. ఈ ఢమరుకం శబ్ధబ్రహ్మ స్వరూపనికి ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు.
శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. దీనిలో ఉండే మూడు కోణాలు సత్వ రజ తమో గుణాలకు ప్రతీక.
రుద్రాక్ష:

శివుడు సుదీర్ఘ ధ్యానం చేస్తుండగా, మూడు కళ్ళలనుంచి కన్నీటి బిందువులు రాలి, నేల మీద పడి రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి. అక్షులు అనగా కళ్ళు. రుద్రుడి కళ్ళ నుంచి జాలువారిన నీటి బిందువులతో మొలిచిన వృక్షాల కనకే, రుద్రాక్షాలుకి అంత పవిత్రత ఏర్పడింది. రుద్రాక్ష అంటే దేవదేవుడైన రుద్రుడి స్వరూపం.

మహా దేవుడు మనకు ఒక జీవితాన్ని ప్రసాదించాడు. కొన్ని బంధాలు బాధ్యతలు ఇచ్చాడు. అందరూ వారికి ఇచ్చిన ధర్మాన్ని పాటిస్తూ, మంచితనంతో ముందుకు వెళ్తే, అంతా మంచే జరుగుతుంది. మహా దేవున్ని నమ్ముకుని శివ శివ అనుకుంటూ ఉంటూ, రోజుకి కనీసం లేచిన వెంటనే మరియు పడుకునే ముందు, 11 సార్లు శివ అనుకుంటూ ధ్యానిస్తే, శివుడు మనలోనే వుంటాడు.
అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొంతమంది సంతోషంగా ఉంటే , కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు. శివుని ఆజ్ఞా లేనిదే చీమ అయిన కుట్టదు అంటారు కదా, మరి ఎందుకు శివుడు కొంతమంది బిడ్డలకు కష్టాలు ఇస్తున్నాడని అనుకోవచ్చు. శివ పార్వతి లకు లోకంలో ఉన్నా జీవులు అంత బిడ్డలే, శివయ్య దృష్టిలో ఎవ్వరైనా ఒక్కటే, బిడ్డల క్షేమన్నే కోరుకుంటాడు. ఇప్పుడున్న మన ఈ కష్టాలు గత జన్మలో చేసిన పాప పుణ్య ఫలితాలే. వీటికి మహాదేవుడే దారీ చూపించగలడు. కష్టాలు ఎదురైనపుడు మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగజేసి, కష్టాలని ఎదుర్కునే శక్తిని ప్రసాదిస్తాడు. చేసే పూజలు, దాన ధర్మాలు, సత్కర్మలు వలన మహాదేవుడు సంతృస్తుడయి మన ఈ కష్టాలని దూరం చేయగలడు.మనలో శివుడు ఉన్నాడు, అలానే ఎదుటి వాళ్లలో కూడా శివుడు ఉంటాడు.మనకి ఓపిక ఉన్నంత లేనివాళ్ళకి సహాయం చేస్తూ, అవసరంలో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తూ పరమశివుణ్ణి ధ్యానిద్దాం… ఓం నమః శివాయ..
This post was created with our nice and easy submission form. Create your post!
GIPHY App Key not set. Please check settings